HomeIndustry newsమస్తు షేడ్స్ ఉన్నయ్ రా!... సినిమా సమీక్ష

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా!… సినిమా సమీక్ష

రివ్యూ: మస్తు షేడ్స్ ఉన్నయ్ రా!…

అభినవ్ గోమఠం… మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. అతడు తొలిసారిగా నటించిన ఈ ‘నగరానికి ఏమైందీ’ చిత్రంలో చెప్పిన డైలాగ్ ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా!..’ ఈ డైలాగు ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడే ఇదే డైలాగు పేరుతో ఓ సినిమానే తెరకెక్కించారు. ఇందులో అభినవ్ గోమఠం హీరో కాగా… అతనికి జోడీగా వైశాలి రాజ్ నటించారు. తిరుపతి రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్ వి.. సంయుక్తంగా కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తన కామెడీ టైమింగ్ తో ఇంతకు ముందు ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్స్ లో అలరించిన అభినవ్ గోమఠం… ఇప్పుడు ఈ సినిమాలో ఏమాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడో చూద్దాం పదండి.

కథ: మను(అభినవ్ గోమఠం) ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. తండ్రి మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్. మను కూడా చిన్నప్పటి నుంచే పెయింటింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాధించుకుంటాడు. అలా పెరిగి పెద్దాయ్యాక కూడా పెయింటింగ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతూ ఉంటారు. అయితే మనుకు డబ్బుల్లేవని, పెయింటింగ్ వల్ల వచ్చే అతని సంపాదన తనకు చాలదని… మనుని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి… అదే గ్రామానికి చెందిన డబ్బున్న యువకునితో వెళ్లిపోతుంది. దాంతో మను ఎలాగైనా జీవితంలో సెటిల్ కావాలని… అందుకు డబ్బు సంపాధించాలనుకుంటాడు. దాంతో తన సొంత ఊళ్లోనే ఓ మోడ్రన్ టెక్నాలీతో తనకున్న కళను మెరుగుపరచుకుని… ఓ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును పెట్టి డబ్బు సంపాధించాలనుకుంటాడు. అయితే… అందుకు కావాల్సిన డబ్బులు పోగేసి… ఓ అధునాతనమైన ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ ను కొనుక్కోవాలని అతని స్నేహితుడు శివ(మొయిన్ మహ్మద్) అదేగ్రామానికి చెందిన మరొక వ్యక్తి(నిజల్ గళ్ రవి)తో కలిసి పట్టణానికి వెళతాడు. అక్కడ మెషిన్ ఇచ్చే వ్యక్తి డబ్బులు తీసుకుని… తీరా షాపు ఓపెనింగ్ సమయానికి మెషిన్ ఇవ్వకుండా ముఖం చాటేస్తాడు. మరి మను తను అనుకున్న విధంగా తన ఊళ్లో ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషిన్ షాపు పెట్టారా? మిషిన్ ఇవ్వకుండా మోసం చేయడంతో మను ఎలా ఫ్లెక్సీలను ప్రింటింగ్ వేశారు? పెయింటర్ డిజైనర్ అయిన మను ఫ్లెక్సీ డిజైనింగ్ నేర్చుకోవడం కోసం ఎలాంటి కసరత్తులు చేసి… అందులో ప్రావీణ్యం సాధించారు? తదితర వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: యువత తనలోని టాలెంట్ ను ఉపయోగించుకుని సొంత కాళ్లపై జీవితంలో స్థిరపడవచ్చనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఇన్సిపిరేషన్ అంశాలు చాలానే ఉన్నాయి. చాలా మంది యువత తమలోని టాలెంట్ ను గుర్తించకుండా… ఏవేవో ఆలోచించి సమయాన్ని వృథా చేస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కిన ఈ సినిమా… చాలా మందికి కనువిప్పు కలిగిస్తుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువకులు సమాజంలో ఎలాంటి ఇబ్బందలు పడుతుంటారు? వారిలో టాలెంట్ ఉన్నా…. కొన్ని అనుకోని పరిస్థితులు వారిని ఎలా వెనక్కి నెట్టేస్తుంటాయి? విలేజ్ లలో డబ్బు లేకుంటే ఎలా చూస్తారు? తదితర అంశాలన్నింటినీ కూడా దర్శకుడు చాలా కూలంకషంగా పరిశీలించి ఈ సినిమాని తెరకెక్కించారనిపిస్తుంది. ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ అనేది చాలా సాధారణ అంశమే అయినా… గ్రామాల్లో ఏదైనా చేయాలనుకుంటే… దాన్ని ఎంతో ప్రిస్టేజ్ గా భావించి… నలుగురిలో నవ్వులపాలు కాకుండా చేయాలనుకుంటారు. అలాంటి కోణంలోనే ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఎక్కడా బోరింగ్ లేకుండా ఆడియన్స్ ను కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత సరదాగా సాగిపోయినా… సెకెండాఫ్ మాత్రం సీరియస్ మోడ్ లో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

అభినవ్ గోమఠం అనగానే… ఇందులో పిచ్చ కామెడీ ఉంటుందని అందరూ భావించొచ్చు. కానీ అందుకు భిన్నంగా సినిమాలో అతని పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు. బాధ్యత గల ఓ దిగువ మధ్యతరగతికి చెందిన యువకుని పాత్రలో అభిన్ ఒదిగిపోయి నటించారు. అతనికి జోడీగా నటించిన వైశాలి రాజ్ పాత్ర పర్వాలేదు. అభినవ్ కి స్నేహితునిగా నటించిన మొయిన్ కూడా చలాకీగా బాగా చేశాడు. హీరో పాత్రతో పాటు ట్రావెల్ అయ్యే పాత్ర తనది. అలాగే డబ్బున్న కుర్రాడి పాత్రలో ఆలీ రాజా కూడా మెప్పించారు. మొదట్లో అతని క్యారెక్టర్ ను బాగా హైప్ చేసి… ద్వితీయార్థంలో మాత్రం డౌన్ చేశారు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో లావణ్య రెడ్డి పర్వాలేదు అనిపించారు. తమిళ నటుడు నిజల్ గళ్ రవి పాత్ర కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇందులో ఎమ్మెల్యే పాత్రలో కాసేపు తరుణ్ భాస్కర్ కనిపించారు. అలాగే వైజాగ్ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కూడా క్యామియో చేసి ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు తిరుపతి రావు ఎంచుకున్న కథ… కథనాలు బాగున్నాయి. సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా తెరకెక్కించారు. కమెడియన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న అభినవ్ ని… నీలో మస్తు షేడ్స్ ఉన్నయ్ రా… అని ఓ డిఫరెంట్ లుక్ లో కూడా చూపించారు. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి రిచ్ గా ఉంది. పల్లె వాతావరణాన్ని బాగా ఎలివేట్ చేసి చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాతలు భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి… ఈ వీకెండ్ లో సరదాగా చూసేయండి.

ఆకట్టుకునే విలేజ్ డ్రామా….

రేటింగ్: 3/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments